హైదరాబాద్‌తో తీరిపోనున్న ఆంధ్రప్రదేశ్ ‘ అధికారిక ’ బంధం

 


ఈ ఏడాది జూన్ 2 తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆ రోజుతో పదేళ్లు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు కూడా ఆనాటితో ముగియనుంది. దీంతో తెలంగాణకే హైదరాబాద్ రాజధానిగా కొనసాగనుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింట్ డేను ప్రకటించింది నాటి యూపీఏ ప్రభుత్వం. 

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడంతో హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీనికి అనుగుణంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. చట్టంలో పేర్కన్న విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా ముగియనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కొన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు , సిబ్బంది భాగ్యనగరాన్ని విడిచి తమ సొంత రాష్ట్రానికి తరలిపోతున్నాయి. 

అయితే హైదరాబాద్‌తో ఆంధ్రులది విడదీయరాని అనుబంధం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో పెట్టుబడులు పెట్టి, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలకు చెందినవాళ్లు నగరంలో స్థిరపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్‌ కోసం ఎంతో గొడవ జరిగింది. హైదరాబాద్‌ ఇరురాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా శాశ్వతంగా కొనసాగించాలనే డిమాండ్లు వినిపించాయి. 

నగరంపై ఏ రాష్ట్రానికి అజమాయిషీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా కొందరు కోరారు. కానీ కేంద్రం మాత్రం వీటిని పట్టించుకోకుండా కేవలం పదేళ్ల కాలపరిమితితో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేలా నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు పదేళ్ల గడువు పూర్తి కావడంతో మరోసారి ఉమ్మడి రాజధాని ప్రస్తావన తెరపైకి వస్తోంది. సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఈ డిమాండ్‌ను తెచ్చారు. 

మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అనేది లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే  మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.

అయితే జేడీ లక్ష్మీనారాయణ ప్రతిపాదనకు అవకాశం ఉందా లేదా అనేది  చూస్తే. పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడే 2015లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను ఏపీకి తరలించారు. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ విధానంలో 33 వేల ఎకరాలు సేకరించి తాత్కాలికంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వసతి గృహాలు, శాసనసభ , శాసనమండలి, సెక్రటేరియట్ భవనాలు నిర్మించారు. 

అమరావతి అభివృద్ధి దశలో ఉండగా 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్ధతు పలికిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో శాసన, కార్యనిర్వహక, న్యాయ రాజధానులు ఉండాలని జగన్ భావించారు. 

అమరావతి యథావిధిగా శాసన రాజధానిగా ఉంటుందని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని తెలిపారు. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు, పలువురు కోర్టులను ఆశ్రయించడంతో మూడు రాజధానుల వ్యవహారం ముందుకు సాగక.. అటు అమరావతి పూర్తి కాక ఏపీకి రాజధాని లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిస్తే మరో మాట లేకుండా విశాఖకు రాజధానిని తరలిస్తారు. జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆల్రెడీ వైసీపీ నేతలు చెబుతున్నారు. 

అదే కూటమి అధికారంలోకి వస్తే అమరావతే రాజధానిగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరు సీఎం అయినా ఉమ్మడి రాజధాని ప్రస్తావన తీసుకొస్తారన్న మాట వినిపించడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు , సంస్థలు, సిబ్బంది తరలివచ్చేసిన నేపథ్యంలో ఉమ్మడి రాజధానితో పెద్దగా ఉపయోగం ఉండదనేది మేధావుల మాట. హైదరాబాద్ ఉమ్మడి ఏపీ రాజధానిగా ఉన్నా.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నా వచ్చిన మార్పేం లేదు. ఎప్పటిలాగే ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. 


Comments